కుక్కలపై మక్కువతో పెంచుకొంటే సరిపోదు అవి ఎవర్నీ కూడా కరవకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెంచిన వారిపై ఉంటుంది. పెంపుడు కుక్క దాడిలో గాయపడిన బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్‌ను వినియోగదారుల ఫోరమ్ ఆదేశించింది. అవసరమైతే ఈ మొత్తాన్ని శునకాన్ని పెంచుకుంటున్న యజమాని దగ్గర నుంచి వసూలు చేయవచ్చని స్పష్టం చేసింది. ఇళ్లలో పనిచేసే మున్నీ అనే మహిళ.. ఆగస్టు 11న తన వదినతో కలిసి వెళ్తుండగా ఓ పెంపుడు కుక్క దాడిచేసింది. వినీత్ చికారా అనే వ్యక్తి పెంపుడు కుక్కు దాడిలో మున్నీ తీవ్రంగా గాయపడింది. ముఖం, చేతులపై తీవ్ర గాయాలైన బాధితురాలిని తొలుత గురుగ్రామ్ సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. కుక్కతో పాటు యజమాని పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. తొలుత పిట్‌బుల్ జాతికి చెందిన శునకంగా భావించినా.. ఇది డోగో అర్జెంటినో జాతికి చెందిన కుక్కగా యజమాని తెలిపారు. ఈ ఘటనపై జిల్లా వినియోగదారుల ఫోరమ్ విచారణ చేపట్టి.. కుక్కను అదుపులోకి తీసుకోవాలని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. అలాగే, యజమాని వినీతా చికారాకు శునకాన్ని పెంచుకోవడానికి అనుమతించిన లైసెన్స్‌ను రద్దు చేసింది. దీంతో పాటు 11 విదేశీ జాతులకు చెందిన శునకాలను నిషేధించాలని, తక్షణమే అటువంటివి కస్టడీలోకి తీసుకోవాలని సూచించింది.
అంతేకాదు, మూడు నెలల్లోగా పెంపుడు కుక్కలకు సంబంధించి ఓ పాలసీనీ తీసుకురావాలని ఎంసీజీని ఆదేశించింది. ‘‘న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఇతరుల ఇళ్లలో ఇంటి పనులు చేసే అత్యంత పేద మహిళగా పేర్కొన్న బాధితురాలికి మధ్యంతర ఉపశమనం కింద గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.2 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశిస్తున్నాం’’ అని పేర్కొంది.
‘‘కుక్క యజమాని చట్టాన్ని నిర్ద్వంద్వంగా ఉల్లంఘించాడు.. నిషేధిత జాబితాలోని డోగో అర్జెంటీనో కుక్కను పెంచుకుని దాని కోసం రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించారని మరింత స్పష్టం చేశాం.. కాబట్టి అతడి వద్ద నుంచి రూ.2 లక్షలు పరిహారం వసూలు చేసే స్వేచ్ఛ ఎంసీజీకి ఉంది’’ అని పేర్కొంది. ఈ కేసులో బాధితురాలి తరఫున న్యాయవాది సందీప్ సైనీ వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశారు. తన క్లయింట్‌కు ₹ 20 లక్షల పరిహారం డిమాండ్ చేశారు. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి సంజీవ్ జిందాల్.. మంగళవారం తీర్పు వెలువరించారు. బాధితురాలికి పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.