సహజీవనంపై తీవ్రంగా మండిపడ్డ కేంద్ర మంత్రి వైఖరిని నేటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇదిలావుంటే సహజీవనంపై కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే అమ్మాయి హత్యకు సహజీవనమే కారణమని ఆయన అన్నారు. చదువుకున్న అమ్మాయిలు ఇలాంటి నీచమైన సంబంధాల్లోకి రాకూడదని చెప్పారు. తల్లిదండ్రులను వదిలేసి, వారికి ఇష్టమైన వ్యక్తులతో కలిసి బతకడం సరికాదని అన్నారు. శ్రద్ధ హత్య నుంచి అమ్మాయిలు చాలా విషయాలను తెలుసుకోవాలని చెప్పారు.
అసలు అమ్మాయిలు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఎందుకు జీవిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా జీవితాన్ని కొనసాగించాలని చెప్పారు. తల్లిదండ్రుల ఆమోదంతోనే ఎవరితోనైనా ఉండాలని అన్నారు. మరోవైపు కౌశల్ వ్యాఖ్యలపై శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి చౌకబారు వ్యాఖ్యలు చేశారని, ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.