‘రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం.. సెన్సిటివ్‌గా ఉంటే ఎదగలేం. రాజకీయాల్లో మాటలు అనాలి.. అనిపించుకోవాలి. చాలా మొరటుగా, కటువుగా ఉండాలి. అప్పుడే రాణించే అవకాశం ఉంటుంది. అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ తగినవాడు, మాటలు అంటాడు.. అనిపించుకుంటాడని చెప్పారు. ‘ఆయనకు మీరందరూ ఉన్నారు.. మీ అందరి ఆశీస్సులతో ఏదో ఒక రోజు అత్యుత్తమ స్థానంలో ఉంటాడ’ని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఆదివారం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎర్రమిల్లి నారాయణమూర్తి (వైఎన్‌ఎం) కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కాలేజీ పూర్వ విద్యార్థి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తనకు వైఎన్‌ఎం కళాశాలలో ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయని చెప్పారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే తనకు నటనపై ఇష్టం ఉండేదని, ఒక నాటకం వేస్తే ఉత్తమ నటుడిగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. తర్వాత అమ్మాయిలు తనను చూస్తుంటే పెద్ద హీరోలా ఫీలయ్యేవాణ్ణి అని నవ్వుతూ చెప్పారు.