గాజువాకలో విభిన్నంగా శివలింగం ఏర్పాటు ఆఖరి సోమవారం జిమ్ నిర్వాహకుల ప్రయత్నం.
నిత్యం వ్యాయామం చేసే వస్తువులే ఆ మహాదేవుని ప్రతిరూపంగా మారితే.! సాక్షాత్తు పరమశివుడే వ్యాయామశాలకు వలసవస్తే.! ముల్లోకాలు పరవశమవటం ఏమో కానీ ఆ అద్భుత ఘట్టాన్ని చూసినవారంతా హరహర మహాదేవా అంటూ మొక్కాల్సిందే. శివనామస్మరణతో తన్మయత్వం పొందాల్సిందే. అచ్చం అలాంటి అద్భుత ఘట్టానికి గాజువాక ప్రాంతం వేదికయ్యింది. పరమపుణ్య కార్తీకమాసంలోని ఆఖరి సోమవారంనాడు శుభాన్ని కలిగించే మంగళకరమైన శివలింగ స్వరూపాన్ని తాము వినియోగించే వ్యాయామసామాగ్రితో రూపకల్పన చేసి శివయ్యపై తమ భక్తిని చాటుకున్నారు గాజువాక నాతయ్యపాలెంలోని రామ్స్ ఫిట్నెస్ జిమ్ నిర్వాహకులు. తమలోని భక్తిభావానికి వినూత్న ఆలోచనలను జోడించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిమ్ యజమాని కె షణ్ముఖ రామ్, ప్రసాద్, కోచ్ బర్ల రవికుమార్ లు మాట్లాడుతూ కార్తీకమాసం సందర్భంగా నెల రోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకుంటామని అయితే ఈ ఆఖరి సోమవారం నిర్వహించే పూజలు సాధారణం కంటే బిన్నంగా ఉండాలనే ఆలోచనతో జిమ్ సామాగ్రితోనే శివలింగాన్ని ఏర్పాటు చేశామన్నారు. మనిషి మనుగడకు ఉపయోగపడే ప్రతీ వస్తువునూ పూజించాలనే సనాతన భారతీయ సంస్కృతి ఆధారంగానే తమ ఆరోగ్య పరిరక్షణకు నిత్యం ఉపయోగించే వ్యాయామసామగ్రిని వినియోగించడం ద్వారా శివలింగాకారంతో పాటుగా వ్యాయామసామాగ్రిని కూడా పూజించవచ్చనే ఆలోచనతో ఈ వినూత్న ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్స్ ఫిట్నెస్ జిమ్ కోచ్ సోమేశ్, సభ్యులు శ్రీకాంత్, సాయి, సత్య, బాను, రామకృష్ణ, కుమార్, సాగర్ తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు.