గ్రామ పంచాయితీ వలంటీర్ ఉద్యోగానికి ఎంఏ బిఈడీ చేసిన గిరిజన మహిళ దరఖాస్తు చేసుకున్న వైనం గురువారం సారవకోట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మౌఖిక పరీక్ష సమయంలో వెలుగు చూసింది. దీనితో మౌఖిక పరీక్ష నిర్వహిస్తున్న ఎంపిడిఓ విశ్వేశ్వరరావు, పంచాయితీ విస్తరణాధికారి ప్రసాద్ పండాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యను అభ్యసించి నిరుద్యోగినిగా ఉండటానికి కారణం అడిగారు. ఉపాధ్యాయ పోస్టుకు డీఎస్సీ పరీక్షలు రాసినప్పటికీ చివరి నిముషంలో తుది జాబితాలో తనకు అవకాశం లేకుండా పోయిందని అభ్యర్ధిని జైనివలస ఆదిలక్ష్మి ఆవేదనతో ఇంటర్వూ చేసిన అధికారులకు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలలో ఖాళీగా ఉన్న ఎనిమిది వలంటీర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి దరఖాస్తులు చేసిన అభ్యర్థులకు మౌఖిక పరీక్ష నిర్వహించారు. పెద్దలంబ పంచాయితీలో గిరిజన మహిళకు కేటాయించిన వలంటీర్ ఉద్యోగానికి ఆదిలక్ష్మి ఒక్కరే దరఖాస్తు చేశారు. విధ్యాధికురాలు ఆదిలక్ష్మికి ఈ చిరు ఉద్యోగం చేతికి చిక్కుతుందో లేదో వేచి చూడాలి.