‘రాప్తాడు సమీపంలో ఏర్పాటు కావాల్సిన జాకీ కంపెనీ (పేజ్ ఇండస్ట్రీస్) యాజమాన్యం గుడ్‌విల్ ఇవ్వని కారణంగా పనులకు అంతరాయం కల్పిస్తూ వచ్చారు. దీంతో ఆ పరిశ్రమ కాస్తా తమిళనాడులోని సేలానికి తరలిపోయిందంటూ 2018 డిసెంబరు 26న సాక్షి పత్రికలో కథనం వచ్చింది. మరి ఆరోజు ఎవరు అధికారంలో ఉన్నారు? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోజు గాడిద పళ్లు తోముతున్నాడా’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన అనంతపురం మండలం ఆలమూరు జగనన్న హౌసింగ్ లేఅవుట్ వద్ద విలేకరులతో మాట్లాడారు.‘కళ్లున్న కబోదులైన చంద్రబాబు, రామకృష్ణ, సోము వీర్రాజుకు వాస్తవాలు మాట్లాడితే రుచించదు. దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లు చంద్రబాటు ట్వీట్లు చేస్తున్నారు. కనీసం పునాదిరాళ్లకు కూడా నోచుకోని ఒక కాగితం కంపెనీకి ఆరోజు వందకోట్లు విలువైన భూములు కేటాయించి గొప్పగా ప్రచారం కల్పించారు. నిర్మాణం జరగకుండానే అది వెళ్లిపోతే రామకృష్ణ ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు.