ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని మీనాపురం గ్రామానికి చెందిన బత్తల మల్లికార్జున, మునిలక్ష్మి దంపతులు నిరుపేదలు. మల్లికార్జున కూలీ పనికి వెళ్తుంటాడు. వారికి ముగ్గురు కుమార్తెలు. కీర్తన చివరి సంతానం. స్థానికంగా ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. 10 ఏళ్ల కీర్తనకు పెద్ద కష్టం వచ్చింది. కొన్ని నెలల క్రితం ముఖంలో గడ్డలు ఏర్పడి వాపు వచ్చింది. తగ్గుతుందిలే అని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఆ వాపు కాస్త ముఖమంతా ఎక్కువగా వ్యాపించింది. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ వచ్చారు. చాలా ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో బాలిక తల్లిదండ్రులు నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని ఆశ్రయించారు. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం నెల్లూరులోని మెడికోవర్ ఆస్పత్రికి పంపించారు. అన్ని రకాల పరీక్షలు చేసి దవడ ఎముక లోపలి భాగంలో క్యాన్సర్ సోకినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఆపరేషన్ చేయిస్తే పూర్తిగా నయం అవుతుందని వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కు రూ.10 లక్షలు మేర ఖర్చు అవుతుందని తెలపడంతో.. వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అంత డబ్బు భరాయించే స్థోమత తమకు లేదని రోదించసాగారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు తాను ఉన్నానని భరోసా ఇచ్చారు.