వైసీపీ నేతలు ధర్మాన సోదరుల అండతోనే వక్ఫ్ బోర్డు విషయంలో అధర్మపరులకు పెద్దపీట వేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ ప్రధానకార్యదర్శి షేక్ ఖాదర్ బాషా ఆరోపించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడితో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ముస్లింలకు ఎంతో ఒరగబెట్టామని గొప్పలు చెప్పుకొంటున్న వైసీపీ నాయకుల అసలుతీరు ఇప్పుడే బయటపడిందని చెప్పారు. టీడీపీ హయాంలో టెక్కలి, శ్రీకాకుళం, ఆమదాలవలస, రణస్థలం షాదీఖానాలకు లక్షల రూపాయలు మంజూర య్యాయని వివరించారు. ఎక్కడ వక్ఫ్ జాగా కనిపించినా అధికార పార్టీకి చెందినవారు గద్దల్లా వాలిపోయి కబ్జా చేసేస్తున్నారంటూ ఆరోపించారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అనుచరుడు సిరాజుద్దీన్ అక్రమాలకు అడ్డులేకుండా పోతుందని ఆరోపించారు. అనంతరం కలెక్టరేట్ స్పందన(జడ్పీ)కు వెళ్లి వినతిపత్రమిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు అబ్దుల్ షాజహాన్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ముబారక్, కార్యదర్శి రోషన్‌బాషా, నియోజకవర్గ అధ్యక్షులు షాను, ఉపాధ్యక్షులు సయ్యద్‌షఫీ, సభ్యులు సయ్యద్ సలీమ్ పాల్గొన్నారు.