రైతులు విత్తనం నాటిన నాటి నుంచి పంట విక్రయించుకునే వరకు ప్రతి అడుగులోనూ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు. రైతులకు వైఎ్‌సఆర్ సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ, ఇన్‌పుట్ సబ్సిడీలను ముఖ్యమంత్రి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయగా.. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 25928 మంది రైతులకు రూ. 6 కోట్ల 63 లక్షల 17 వేలు పంట రుణాల వడ్డీ రాయితీ లబ్ధి చేకూరిందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఇబ్రహీంపట్నం మండలంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన 674 మంది రైతులకు రూ. 55.08 లక్షలు నేరుగా వారి ఖాతాలలో పెట్టుబడి రాయితీ జమ చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, విత్తనం నుంచి పంట కొనుగోళ్ల వరకు అన్ని విధాల రైతులకు సహకారిగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వారి అవసరాలను తీరుస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, అధికారులు, రైతులు పాల్గొన్నారు.