ఆఫ్రికా దేశాల్లో ఆకలి కేకలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఓ నౌకలో ముగ్గురు వలస జీవులు పొట్టకూటి కోసం నైజీరియా నుంచి యూరప్‌కు ప్రయాణించిన తీరు, అక్కడి దయనీయ పరిస్థితికి అద్దంపడుతోంది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అలిథిని-2 అనే వాణిజ్య నౌక చమురు, రసాయనాలతో నైజీరియా నుంచి యూరప్‌కు ప్రయాణిస్తోంది. 11రోజుల ప్రయాణం తర్వాత స్పెయిన్‌లోని క్యానరీ ఐలాండ్ తీరానికి చేరిన ఈ నౌక చుక్కానిపై ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉండటం స్థానిక కోస్ట్ గార్డులు గమనించారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. 11 రోజుల నుంచి ఆహారం తీసుకోకుండా, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో ఓడ చుక్కానిపై కూర్చుని ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ముగ్గురిలో 11 ఏళ్లలోపు బాలుడు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.