కృష్ణాజిల్లా, గుడివాడలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ పామర్రు - కత్తిపూడి జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతుల ఆందోళనకు తెలుగు రైతు సంఘం మద్దతు తెలిపింది. ఆంక్షలు ఎత్తివేసి, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారికి ఇరువైపుల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అధికారులు వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేస్తూ జాతీయ రహదారిపై కూర్చున్నారు. ఆర్బీకే సిబ్బంది, మిల్లర్లు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని, కావాలనే మిల్లర్లు లేనిపోని షరతులతో రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని తెలుగు రైతు సంఘం నాయకులు ఆరోపించారు.