విజయవాడ దుర్గగుడిలో ఏసీబీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై ఎట్టకేలకు ఈవో భ్రమరాంబ చర్యలు తీసుకున్నారు. ఆలయంలో 15 మంది ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారని గతంలో ఏసీబీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. 10 రోజుల క్రితం వారిపై చర్యలు తీసుకోవాలని ఈవోకు దేవాదాయ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 9 మందిపై ఈవో చర్యలు తీసుకున్నారు. జరిమానాతో పాటు ఇంక్రిమెంట్లో కోత పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మరో ఆరుగురి వల్ల ఆలయానికి ఎటువంటి ఆర్థిక నష్టం జరగలేదని తేల్చేశారు. 15 మందిలో తొమ్మిది మందిపై చర్యలు తీసుకుని ఆరుగురిని తప్పించటంపై ఆలయ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. ఇది పూర్తిగా ఉద్యోగుల పట్ల వివక్ష చూపించటమే అని ఆరోపించారు.