వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ యూటీఎఫ్ ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ధర్నాచౌక్‌లో నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి యూటిఎఫ్ ప్రతినిధులు వచ్చారు. ఈ నేపథ్యంలో ధర్నా శిబిరానికి చేరుకున్న పోలీసులు ధర్నాకు అనుమతి లేదని ఆందోళనకారులను అరెస్టు చేశారు. దీంతో యూటిఎఫ్ నేతలు పోలీసులు, ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూటిఎఫ్ ప్రతినిధి యన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలీసులు పర్మిషన్ ఇచ్చి అన్ని జిల్లాల్లో ముందస్తుగా బైండ్ ఓవర్ చేశారని, ధర్నాకు పర్మిషన్ లేదనే పేరుతో మమ్మల్ని అరెస్టు చేశారని అన్నారు. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. ఉపాధ్యాయలను అరెస్ట్ చేసిన ప్రభుత్వం తగిన మూల్యం చేయించుకుంటుందన్నారు. పర్మిషన్ ఇచ్చి ఉపాధ్యాయులు అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. బకాయిలు చెల్లించలేని, సీపీఎస్ రద్దు చేయలేని ప్రభుత్వం.. ఉద్యోగులు, ఉపాధ్యాయులను మాత్రం భయపెట్టి అరెస్టు చేస్తుందని వెంకటేశ్వర్లు మండిపడ్డారు.