మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మూడున్నరేళ్లలోనే 98 శాతం నెరవేర్చిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అని, ఇలాంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో శాసనసభ్యుడిగా పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నానని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన వైయస్ జగన్.. వారి కష్టాలను తీర్చేందుకు కేవలం రెండు పేజీల్లో మ్యానిఫెస్టోను రూపొందించి, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాలు, అన్ని కులాలను ముందుకు తీసుకెళ్తున్న దేశ చరిత్రలోనే ఏకైక నాయకుడు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. రూ.1.76 లక్షల కోట్లు మూడున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు అందజేశారన్నారు. మదనపల్లెలో ‘జగనన్న విద్యా దీవెన’ నగదు విడుదల బహిరంగ సభలో ఎమ్మెల్యే నవాజ్ బాషా పాల్గొని మాట్లాడారు.