రష్యాన్ మాజీ మంత్రిని డెహ్రాడూన్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. సరైన పత్రాలు లేకుండా శాటిలైట్ ఫోన్‌ను తన వెంట తీసుకొచ్చిన రష్యా మాజీ మంత్రిని డెహ్రాడూన్ విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ముందస్తు అనుమతి లేకుండా విమానాలు, విమానాశ్రయాల్లోకి శాటిలైట్ ఫోన్లు తీసుకురావడం నిషేధం. ఈ నిబంధన ప్రకారం రష్యా మాజీ మంత్రి విక్టర్ సెమెనోవ్ (64)ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో విమానం కోసం ఎయిర్‌పోర్ట్‌కు సెమెనోవ్ చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం 4.20 గంటలప్పుడు తనఖీల సమయంలో ఆయన వద్ద శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు సీఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు.
తనిఖీల సమయంలో శాటిలైట్ ఫోన్ వినియోగానికి సంబంధించిన అవసరమైన ఎటువంటి పత్రాలను సమర్పించలేకపోయారని అధికారులు తెలిపారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) ప్రకారం.. అత్యవసర సమయంలో వ్యక్తిగత ఉపయోగం కోసం శాటిలైట్ ఫోన్‌ను తీసుకెళ్లినట్లు రష్యా మాజీ మంత్రి చెప్పారు. అయితే, ఆయన భారత్ పర్యటనకు ఎందుకొచ్చారనేది తెలియరాలేదు. కాగా, విక్టర్ సెమెనోవ్ 1998 నుంచి 99 వరకూ రష్యా వ్యవసాయ, ఆహార శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉంటున్నారు.
![]() |
![]() |