అందరికన్నా ఆలోచనల్లో అందరికన్నా తాను యాక్టివ్ గా ఉంటానని కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి, భావి తరాల గురించి ఆలోచించే పానే యంగ్ నని చెప్పిన చంద్రబాబు.. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించే శక్తి దేవుడు తనకిచ్చాడని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం రాత్రి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. సాయంత్రానికి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. అయితే పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబును పోలీసులు అనుమతించలేదు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో చంద్రబాబు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు ముఖద్వారం వద్దే చంద్రబాబు నడిరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జగన్ సర్కారు తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఏపీలో జగన్ ఉన్మాద పాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లే అర్హత తనకు లేదా? అని నిలదీశారు. జగన్ తన చీకటి పాలనతో పోలవరాన్ని నిండా ముంచేశారన్న చంద్రబాబు.. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ ఏమైందో ఎవరికీ తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తన కక్కుర్తి, కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును బలి చేస్తోందని విరుచుకుపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నానని కూడా ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఎలాగైనా కట్టడి చేయాల్సిందేనని చంద్రబాబు అన్నాురు. పోలవరం ఏపీకి ఒక వరమన్న చంద్రబాబు... టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరాన్ని జిల్లాగా ప్రకటిస్తామని తెలిపారు. పోలవరం మండలాలన్నింటినీ కలిపి జిల్లా చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.