కొందరు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నా నిత్యవిద్యార్థిగా కూడా కొనసాగుతుంటారు. ఇక ఏపీ ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలెక్టర్‌గా సరికొత్త పంథాలో ముందుకు సాగుతారు. ఎక్కడ పనిచేసినా వినూత్నంగా ఆలోచిస్తారు.. ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చంద్రుడు చేసిన కార్యక్రమాలతో జిల్లా నుంచి ఢిల్లీ వరకు ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా చంద్రుడు ఇప్పటికీ తన చదువును కొనసాగిస్తున్నారంటే నమ్మగలరా.. నిజంగానే ఆయన ఇటీవల మరో కోర్సు పూర్తి చేశారు. ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
‘మహనీయులు నడిచిన దారిలో.. ఒబామా చదివిన హార్వార్డ్ లా స్కూల్ లో ఒక కోర్సు పూర్తి చెయ్యడం జరిగింది. నమ్మకంతో ముందుకు వెళితే ఏదైనా సాధ్యమే’ అంటూ ట్వీట్ చేశారు. తాను దిగ్విజయంగా కోర్సు పూర్తి చేసినట్లు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా చదివిన లా స్కూల్‌లో కోర్సు చేసినట్లు తెలిపారు. నమ్మకంతో ముందుకు సాగితే ఏదైనా సాధించొచ్చని వ్యాఖ్యానించారు.
‘నమ్మకం&అవకాశం. వేల సంవత్సరాల నిరక్షరాస్యత నుండి ప్రపంచంలో వున్న అత్యుత్తమ విశ్వవిద్యాలయానికి చేరుకోగలిగాను. అలాంటి నమ్మకాన్ని&అవకాశాన్ని ఇచ్చిన రాజ్యాంగానికి ఎంతో రుణపడి వున్నాను. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు’ తెలియజేస్తూ ఇటీవల మరో ట్వీట్ కూడా చేశారు. అప్పుడు కూడా హార్వార్డ్ లా స్కూల్ ఫోటోను షేర్ చేశారు.
పేద కుటుంబం నుంచి వచ్చిన చంద్రుడు ఎన్నో కష్టలు ఎదుర్కొని ఐఏఎస్ అయ్యారు. గతంలో టికెట్ కలెక్టర్‌గా కూడా పనిచేశారు.. తర్వాత పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాలను అందుకున్నారు. అంతేకాదు కలెక్టర్‌గా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఇంటర్ విద్యార్థినులను ఒక్కరోజు కలెక్టర్, సబ్ కలెక్టర్ కుర్చీలో కుర్చోపెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు. విద్యార్థుల్లో ఓ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. తాము కష్టపడి కలెక్టర్లం అవుతామని.. గొప్ప స్థాయిలో ఉంటామనే లక్ష్యాల దిశగా సాగేలా ప్రయత్నం చేశారు.
అంతేకాదు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు గంధం చంద్రుడు. గ్రామాల్లో ఉండే మాల పల్లె, మాదిగ పల్లె, హరిజన వాడ, గిరిజన వాడ, దళితవాడ వంటి కులాలను సూచించే పేర్లను మార్చేయాలని ఆదేశాలు ఇచ్చారు.అనంతపురం జిల్లాలో కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఈ నిర్ణయాన్ని అమలు చేశారు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలను అమలు చేశారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. స్కూళ్లకు వెళ్లి తనిఖీలు చేసేవారు.. అలాగే విద్యార్థులకు పాఠాలు చెప్పారు.. అక్కడ సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.