గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు రికార్డులను బీజేపీ సొంతం చేసుకొంది. మునుపటి సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించిన సునామీ సృష్టించింది. బీజేపీ 182 స్థానాలకు గాను 156 స్థానాల్లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఊపులో కాంగ్రెస్ గల్లంతైంది. కాంగ్రెస్‌కు చెందిన పెద్ద తలకాయలన్నీ ఓటమి పాలయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు గెలుపన్నదే ఎరుగని ఝగాడియా అసెంబ్లీ స్థానాన్ని సైతం బీజేపీ తొలిసారి సొంతం చేసుకుంది. ఇక్కడి నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి, ప్రముఖ గిరిజన నేత అయిన రితేశ్ వాసవ, ఏడుసార్లు ఎమ్మెల్యే చోటుభాయ్ వాసవపై 23,500 ఓట్లతో విజయం సాధించారు. రితేశ్ వాసవకు 89,552 ఓట్లు పోలవగా, ప్రత్యర్థి చోటుభాయ్ వాసవకు 66,433 ఓట్లు వచ్చాయి.
ఝగాడియా అసెంబ్లీ నియోజక వర్గం గుజరాత్‌లోని భూరూచ్ జిల్లాలో ఉంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో గిరిజనులు ఉన్నారు. ఇక్కడ 73 శాతం మంది అంటే 1,73,196 మంది ఎస్టీ వర్గానికి చెందిన వారే. గ్రామీణ ఓటర్ల సంఖ్య 2,36,829. 2017లో భారతీయ గిరిజన పార్టీ (బీటీపీ)ని స్థాపించిన చోటుభాయ్ అమర్‌సిన్హ్ వాసవ 1990 నుంచి ఇక్కడ గెలుస్తూనే ఉన్నారు. జేడీయూ టికెట్‌పై ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన చోటుభాయ్.. 2017లో బీజేపీ అభ్యర్థి రవిభాయ్ వాసవపై 48,948 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
బీటీపీ అధ్యక్షుడు అయిన చోటుభాయ్ వాసవ కుమారుడు మహేశ్ వాసవ ఈ ఎన్నికల్లో ఝగాడియా స్థానం నుంచి పోటీ పడగా, చోటుభాయ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కుటుంబ కలహాలకు చివరి నిమిషంలో స్వస్థి చెప్పిన మహేశ్ తన నామినేషన్‌ను వెనక్కి తీసుకుని తండ్రికి మద్దతు పలికారు. అయినప్పటికీ ఆయన ఓటమి పాలయ్యారు.