రెండు రాష్ట్రాలను కలిపే విషయాన్ని దేవుడికి వదిలేసి.. ఏపీలో ఉన్న అన్న జగన్‌ను, తెలంగాణలో ఉన్న చెల్లెలు షర్మిలను కలపాలని సూచించారు. వైఎస్ కుటుంబాన్నే కలపలేని మీరు రెండు రాష్ట్రాలను ఎలా కలుపుతారని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణలు మళ్లీ ఒక్కటి కావాలన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ఆయన పై విధంగా స్పందించారు.
విభజన హామీలను గాలికొదిలేసి ఇప్పుడు ఉమ్మడి ఏపీని స్వాగతిస్తామని సజ్జల అనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వైసీపీ ఈ కొత్త నాటకానికి తెరతీసిందని దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే ఏపీ ఆస్తుల్ని తెలంగాణకు ధారాదత్తం చేశారని మండిపడ్డారు. ఆర్టికల్ 3 ద్వారా కేంద్రం విభజన నిర్ణయం తీసుకోవచ్చని అప్పట్లో సలహా ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా? అని బాలకోటయ్య ప్రశ్నించారు.