హిందూయిజం సహా అన్ని మతాలు బహు వివాహాలను అనుమతిస్తున్నాయని, కానీ 1950లలో హిందూ కోడ్ బిల్లు ఆమోదించిన తర్వాత నిలిచిపోయాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. ముస్లింల బహు భార్యత్వాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని, దేశంలో నివసించే పురుషుడు తన జీవిత భాగస్వామికి విడాకులు ఇవ్వకుండా ముగ్గురు నలుగుర్ని పెళ్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. గురువారం గువహటిలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ... ‘‘స్వతంత్ర భారతావనిలో నివాసం ఉండే పురుషుడు తన జీవిత భాగస్వామికి విడాకులు ఇవ్వకుండా మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకునే హక్కు లేదు. అలాంటి వ్యవస్థను మేము మార్చాలనుకుంటున్నాం. ముస్లిం మహిళలకు న్యాయం చేసేందుకు మేం కృషి చేస్తున్నాం’’ అని ఆయన ఉద్ఘాటించారు.
‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’ను మేము కాంక్షిస్తున్నాం.. ముస్లిం పిల్లలందరూ వైద్యులు, ఇంజనీర్లు కావాలంటే మదర్సాల్లో కాకుండా సాధారణ పాఠశాలలు, కళాశాలల్లో చేరాలని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కోరుకుంటోంది’ అని సీఎం చెప్పారు. చాలా మంది ప్రజాప్రతినిధులు అటువంటి సలహాలు ఇవ్వరని ఎందుకంటే వారు పోమ్వా ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తారని వ్యాఖ్యానించారు. తూర్పు బెంగాల్ లేదా బంగ్లాదేశ్ మూలాలుండే బెంగాలీ మాట్లాడే ముస్లింలను పోమ్వా ముస్లింలుగా పిలుస్తారు.
మొరిగావ్‌లోని ఒక మదర్సాలో అల్-ఖైదా లింకుల గురించి తాను ఆందోళన చెందుతున్నానని సీఎం చెప్పారు. తాము మొరిగావ్ జిల్లాను అల్-ఖైదా స్థావరంగా మార్చలేమని సీఎం శర్మ స్పష్టం చేశారు. ఇటీవల లోక్‌సభ ఎంపీ, ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ చేసిన వ్యాఖ్యలకు హిమంత కౌంటర్ ఇచ్చారు. అజ్మల్ సూచన ప్రకారం మహిళలు 20-25 పిల్లలకు జన్మనివ్వగలరని, అయితే ఆహారం, బట్టలు, విద్య సహా వారి భవిష్యత్తు ఖర్చులన్నీ ప్రతిపక్షాలే భరించాల్సి ఉంటుందని అన్నారు.
అటు, సీఎం వ్యాఖ్యలపై అసోం కాంగ్రెస్ శాసనసభాపక్ష డిప్యూటీ లీడర్ రకిబుల్ హుస్సేన్ స్పందిస్తూ... మత సంబంధిత సున్నితమైన అంశాలను రాజకీయాలను చేయాలని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ‘‘ఒక ప్రభుత్వం రాజ్యాంగంపై ప్రమాణం చేస్తుంది.. అది దాని పరిధిలో పని చేయాలి. ఇది అన్యాయమని వారు భావించినందున ముస్లిం పురుషులు బహుళ వివాహాలను నిరోధించడానికి చట్టాన్ని తీసుకురావాలి.. అప్పటిదాకా ఎందుకు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు’’ అని ఆయన ప్రశ్నించారు.