విద్యార్థులకు మేనమామ అని చెప్పుకుంటున్న జగన్ మేనమామ కాదు, కంసమామ అని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులు కావాలని పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల జడ్పీపాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఈ నేపథ్యంలో పాఠశాలను మాజీ ఎమ్మెల్యే యరపతినేని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి తరగతులన్నీ కలియతిరిగారు. పాఠశాల తరగతి గదుల్లో ఖాళీగా కూర్చున్న విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులు మాకు ఏడుగురు ఉపాధ్యాయులు కావాల్సి ఉందని, ఒక్కరే ఉండటం చదువుకు ఇబ్బందిగా ఉందని, మిగిలిన వారిని నియమించాలని అధికారుల దృష్టికి వెళ్లేందుకు ఆందోళన చేస్తే ఉన్న ఒక్కరిని ఎందుకు సస్పెండ్ చేశారో అర్థం కావటంలేదన్నారు. పదోతరగతి చదువుతున్న 20 మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. బాగా చదువుకుంటామని, కావాల్సినంత మంది టీచర్లను పెట్టమంటే.... ఉన్న ఒక్కరిని తీసేశారని యరపతినేని ముందు వాపోయారు.