గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్‌ను అంబేద్కర్ సెంటరుగా అభివృద్థి చేస్తామని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు తెలిపారు. శుక్రవారం స్థానిక లాడ్జి సెంటర్‌లోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహం, అమరావతి రోడ్డులోని బీ.పీ.మండల్ విగ్రహ నిర్మాణ స్థలాన్ని మేయర్ నగరపాలక సంస్థ అధికారులు, దళిత సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్‌ల ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని, బీసీలు, ఎస్సీల అభివృద్థికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. బీఆర్ అంబేద్కర్, బీసీ మండల్ వంటి మహనీయులు దేశానికి చేసిన సేవలని దృష్టిలో ఉంచుకొని గుంటూరు నగరంలో వారి విగ్రహాల ఐల్యాండ్‌లను అత్యంత సుందర వనంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఇక నుంచి లాడ్జి సెంటర్‌ను అంబేద్కర్ సెంటర్‌గా అభివృద్థి చేస్తామని తెలియచేశారు. లాడ్జి సెంటర్ (అంబేద్కర్ సెంటర్) లోని సర్కిల్ చుట్టూ అంబేద్కర్ సెంటర్ అని బోర్డులు ఏర్పాటు చేసి, గ్రినరీ, రైలింగ్ ఆధునికీకరణకు ప్రణాళికలు సిద్థం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. గుంటూరు నగరం లోని నాజ్‌సెంటర్, గుజనగుండ్ల, బస్టాండ్ సెంటర్ల జంక్షన్లను కూడా ఆధునికీకరణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గుంటూరు నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేయనున్న బీపీ మండల్ విగ్రహం రాష్ట్రంలోనే మొట్టమొదటిదన్నారు. బీపీ మండల్ విగ్రహ ఏర్పాటుకు పూర్తి సహకారాలు అందిస్తామని, విగ్రహ ఏర్పాటుకు అనువుగా హైమాస్క్ లైటింగ్‌పోల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.