జోరుగా వర్షం పడుతున్నా ఉక్కు సంకల్పంతో మంగళగిరి నియోజకవర్గం , మండల గ్రామం పెనుమూలి, గాంధీనగర్‌లలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ’ కార్యక్రమంలో టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు లోకేశ్‌కు బ్రహ్మరథం పట్టారు. గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. జోరువానలోనూ ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఎస్సీ కాలనీలో బాబూజగ్జీవన్‌రామ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు, తిరుతమ్మగుడి సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి లోకేశ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొన్నేళ్లుగా తమకు వస్తున్న పింఛన్‌ను ఇప్పుడు రద్దుచేశారని కొందరు వృద్ధులు, ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ సరిగా రావడం లేదని విద్యార్థినులు, గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు బిల్లులు నిలిపివేశారని బాధితులు పలువురు ఈ సందర్భంగా నారా లోకేశ్‌కు మొరపెట్టుకున్నారు. ప్రచారం సమయంలో విద్యుత్ సరఫరా నిలిచివేసినప్పటికీ లోకేశ్‌తో కలిసి కార్యకర్తలు ముందుకు సాగారు. ఎస్సీ కాలనీలోని చర్చిలోనూ, గాంధీనగర్ శివాలయంలోనూ, పెనుమూలి మసీదులోనూ ప్రార్థనలు నిర్వహించారు.