జిల్లాలో విద్యాశాఖను రాష్ట్రానికే తలమానికంగా, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు పేర్కొన్నారు. శనివారం కడప నగరంలో నూతన హంగులతో ఏర్పాటు చేసిన జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో కలెక్టర్ తోపాటు జెసి సాయికాంత్ వర్మ, కడప నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్, ట్రైనీ కలెక్టర్ రాహుల్ మీనాలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు నూతన హంగులతో అధునాతన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అర్జీదారులను మర్యాదపూర్వకంగా చూసుకొని, ప్రతి ప్రభుత్వ కార్యాలయాలను దేవాలయాల్లా చూసుకోవాలని సూచించారు. మన కార్యాలయం బాగుంటేనే మన మనసు మన ఆరోగ్యము బాగుంటుందని తద్వారా పని చేసే సామర్థ్యం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయాన్ని నూతన హంగులతో అన్ని రకాల వసతులు కల్పించిన జిల్లా సమగ్ర శిక్ష పథక అధికారి అంబవరం ప్రభాకర్ రెడ్డిని ఆయన అభినందించారు. మన జిల్లా విద్యాశాఖ రాష్ట్రానికి తలమానికగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈవో దేవరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ హెచ్. వెంకటసుబ్బయ్య, బద్దెన కళాపీఠం అధ్యక్షులు గంగసాని సాంబశివారెడ్డి, సమగ్ర శిక్ష ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.