భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి. జీవించడం అంటే గౌరవంగా జీవించడం అని స్వేచ్ఛ సమానత్వం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము ప్రతి వ్యక్తికి అందించాలని భారత రాజ్యాంగం బోధిస్తున్నది. ఎన్నో ఏళ్లుగా ప్రపంచమంతా డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకొంటోంది. మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి జరుగుతూనే ఉంది. కానీ మనిషికి దక్కాల్సిన హక్కులేవీ దక్కడం లేదు. యధేచ్ఛగా హక్కుల హననం జరుగుతూనే ఉంది. మానవాళి హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేతలేని సమాజ నిర్మాణం కోసం పాటుపడాలన్నదే ఖుర్ఆన్ బోధనల సారాంశం. ఖురఆన్ మానవ హక్కుల ప్రకటనను ఈ సందర్భంగా ఒకసారి పరిశీలిద్దాం. ఇస్లామ్ లో మానవహక్కులను నెరవేర్చడం ఇస్లామ్ ధార్మిక విధిగా పేర్కొంటంది ఖుర్ఆన్.
హక్కులు ఆజ్ఞలు..
న్యాయం చెయ్యండి అనీ, ఉపకారం చెయ్యండి అనీ, బంధువుల హక్కులు నెరవేర్చండి అనీ అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు. చెడునూ, అశ్లీలతనూ, అన్యాయాన్నీ, మితిమీరి ప్రవర్తించటాన్నీ నిషేధిస్తున్నాడు. ఆయన మీకు హితబోధ చేస్తున్నాడు, మీరు గుణపాఠం నేర్చుకోవాలని. (దివ్యఖుర్ఆన్ 16:90-91)
గౌరవ మర్యాదల హక్కు
మేము ఆదమ్ సంతతికి పెద్దరికాన్ని ప్రసాదిం చాము. వారికి నేలపై, నీటిలో నడిచే వాహనాలను ప్రసాదించాము. వారికి పరిశుద్ధమైన వస్తువులను ఆహారంగా ఇచ్చాము. మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి స్పష్టమైన ఆధిక్యాన్ని అనుగ్రహించాము. (దివ్యఖుర్ఆన్ 17:70)
సమానత్వం..
మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞానం కలవాడు, సకల విషయాలూ తెలిసినవాడూను. 49:13
స్త్రీ – పురుషులు సమానమే..
మంచిపనులు చేసేవారు - పురుషులైనా స్త్రీలైనా - వారుగనక విశ్వాసులైతే స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు. (4:124)
విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ, వారందరూ ఒకరికొకరు సహచరులు, వారు మేలు చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు చెయ్యవద్దు అని నిరోధిస్తారు. నమాజును స్థాపిస్తారు. జకాత్‌ను ఇస్తారు. అల్లాహ్ పట్ల ఆయన ప్రవక్త పట్ల విధేయత పాటిస్తారు. వారిమీదనే అల్లాహ్ తన కారుణ్యాన్ని తప్పకుండా అవతరింపజేస్తాడు. (ఖుర్ఆన్ 9:71)
భార్య హక్కు
సద్భావంతో జీవితం గడపండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే, బహుశా మీకు ఒక వస్తువు నచ్చకపోవచ్చు. కాని అందులోనే అల్లాహ్ ఎంతో మేలును పెట్టివుండవచ్చు.(4:19)
అనాథల హక్కు కాజేసే వారికి హెచ్చరిక
. అనాథుల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయబడతారు. (ఖుర్ఆన్ 4:10)
ప్రయాణించే హక్కు..
అల్లాహ్ మీ కొరకు భూమిని పాన్పు మాదిరిగా పరిచాడు మీరు దానిపై ఉన్న విశాలమైన మార్గాలలో నడవటానికి వీలు కల్పించాడు. (71:19,20)
జీవించే హక్కు..
ఏ ప్రాణాన్నీ హత మార్చకండి న్యాయంగా తప్ప. (17:33)
‘‘హత్యకు బదులుగాగాని లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకుగాని కాక మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. (5:32)
న్యాయాన్ని పొందే హక్కు..
న్యాయానికి సాక్షులుగా ఉండండి. (ఏదైనా) వర్గంతో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనయి న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చెయ్యండి. ఇది దైవభక్తికి సరిసమానమైనది. (దివ్యఖుర్ఆన్ 5:8)
పేదల హక్కు.. వారి సంపదల్లో ప్రశ్నించేవారికీ, ఉపేక్షితులకూ నిర్ణీతమయిన హక్కు ఉంటుంది. (70:24-25) (ఇస్లామ్ ధర్మంలో మానవహక్కుల రక్షణ గురించి మరింత తెలుసుకోవాలనుకునేవారు 1800 572 3000 టోల్ ఫ్రీ నెంబరకు ఫోన్ చేయగలరు.)