పంట దిగుబడితో తల్లడిల్లిపోతున్న రైతులకు పండిన పంట కూడా సరైన గిట్టుబాటు ధర లేకపోవటంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలంలో 5వేల హెక్టార్లలో పత్తి పంటను సాగుచేశారు. గులాబిరంగు పురుగు ఆశించటంతో పత్తిపంట తీవ్రంగా నష్టపోయారు. 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పత్తిపంట ఈ ఏడాది 5నుంచి 6 క్వింటాళ్లకన్నా రావటం లేదు. రైతన్నకు పత్తిధర తగ్గిపోవటం మరీ నిరాశకు గురిచేస్తోంది. పదిరోజుల క్రితం వరకు క్వింటా రూ.8500ల వరకు కొనుగోలు చేసిన పత్తిపంట నేడు రూ.7వేలకంటే కొనుగోలు చేయకపోవటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు కూడా తమకు ఎగుమతులకు ఆర్డర్ రావటంలేదని, కొనుగోలుచేసిన పత్తిని కూడా తరలించేందుకు ముందుకు రావటంలేదు. అంతేకాకుండా గతంలో 15 రోజులకు చెల్లించే పత్తి నగదు మార్కెట్ మందకొడిగా ఉండటంతో నెల రోజులకు వాయిదాపెట్టి కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ కేంద్రాలను ఏర్పాటుచేసి పత్తిపంటను కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.