ఇపుడు దేనికైాన ఆన్ లైన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన చేశారు. బ్యాంకు కస్టమర్లకు పెద్ద ఊరట కల్పించారు. తమ డీటెయిల్స్‌కు సంబంధించి ఏదైనా అప్‌డేట్ చేసుకునేందుకు కస్టమర్లు కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. బ్యాంకు కస్టమర్లు తమ రీ కేవైసీని ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చని శక్తికాంత దాస్ వెల్లడించారు. అడ్రస్ ఛేంజ్ వంటి సందర్భాల్లో మాత్రం బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుందని, మిగతా పనుల కోసం వెళ్లకున్నా ఏం కాదని ఆర్‌బీఐ గవర్నర్ తేల్చిచెప్పారు. ఇటీవల ఆర్భీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకు ఖాతాలు ఉన్నవారి కస్టమర్ ఐడెంటిఫికేషన్ వివరాల్ని క్రమానుగతంగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వీటి అప్‌డేట్స్ కోసం బ్యాంకులు.. కస్టమర్లను తమ బ్రాంచ్ కార్యాలయాలకు రావాల్సిందిగా కోరేవి. శక్తికాంత దాస్ ప్రకటన నేపథ్యంలో ఇకపై ఇలాంటి పనుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేదు.
ఆర్బీఐ రూల్స్ ప్రకారం.. కస్టమర్లు తమ ఖాతాను ఓపెన్ చేసే సమయంలో KYC వివరాలు సమర్పించడమే కాకుండా.. Re - KYC చేసుకొని.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. కస్టమర్లను పిలవకుండానే.. రీ కేవైసీ పొందొచ్చని బ్యాంకులకు స్పష్టం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఒకవేళ Re- KYC కోసం బ్యాంకులు పట్టుబట్టినట్లయితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయొచ్చని ఆర్బీఐ గవర్నర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం జరిగింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈసారి 35 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచింది. దీంతో మొత్తం రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. ఈ ఒక్క ఏడాదే ఏకంగా 2.25 శాతం రెపో రేటు పెరగడం గమనార్హం. ఏప్రిల్‌లో 4 శాతంగా ఉన్న రెపో రేటు ఇప్పుడు 6.25 శాతానికి పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు.
ద్రవ్యోల్బణం ఇటీవలి కాలంలో ప్రతి నెలా ఆర్‌బీఐ లక్షిత పరిధి అయి 6 శాతానికిపైనే నమోదవుతుంది. దీంతో వడ్డీ రేట్లను పెంచడం అనివార్యమైంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా డిసెంబర్ 13-14 తేదీల్లో సమావేశం కానుంది. అక్కడ కూడా వడ్డీ రేట్లు భారీగా పెరిగే అవకాశముంది. గతంలో 75 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచగా.. ఈసారి అది 50 బేసిస్ పాయింట్లకు పరిమితం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న సమయంలో ఆర్థిక మాంద్యం భయాలు ముంచుకొస్తున్నాయి.