గత ఎనిమిదేళ్ల కాలంలో సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ విధానం ద్వారా తాము దేశ పరిస్థితిని మార్చామని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తెలిపారు. మన దేశానికి కావాల్సింది షార్ట్ కట్ రాజకీయాలు కాదని, సుస్థిరమైన అభివృద్ధి అని మోదీ చెప్పారు. గతంలో పన్ను చెల్లించిన వారి డబ్బు అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల దుర్వినియోగం అయ్యేదని అన్నారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధి, ఐక్య బలం, పురోగతితోనే అభివృద్ధి చెందిన భారత్ ఆవిష్కృతమవుతుందని చెప్పారు. మనం సంకుచిత దృక్పథంతో ఉన్నప్పుడు... మనకు అవకాశాలు కూడా పరిమితంగా ఉంటాయని అన్నారు.
పన్ను చెల్లించే వారి డబ్బును లూటీ చేస్తూ, తప్పుడు హామీలు ఇస్తూ రాజకీయాలు చేయాలనుకునే వారిని, షార్ట్ కట్ రాజకీయాలు చేసే వారిని నమ్మవద్దని చెప్పారు. షార్ట్ కట్ రాజకీయాలతో దేశ అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని... అలాంటి పార్టీలను, రాజకీయ నేతలను ప్రజలు బయటపెట్టాలని కోరారు. రాజకీయాలకు బదులు సుస్థిర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రాజకీయ నేతలందరినీ తాను కోరుతున్నానని చెప్పారు. సుస్థిర అభివృద్ధితో ఎన్నికల్లో విజయం సాధించవచ్చని ప్రధాని అన్నారు.