కేంద్ర బడ్జెట్ 2023-24 పై కసరత్తు ప్రారంభమైంది. ఈ బడ్జెట్‌ను జనాకర్షణీయంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా 2020-21 బడ్జెట్‌లో ప్రకటించిన ‘ప్రత్యామ్నాయ వ్యక్తిగత ఆదాయ పన్ను’ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విధానంలో రూ.2.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారిపై ఎలాంటి పన్ను లేదు. దీన్ని రూ.5 లక్షల వరకు పెంచే విషయంపై కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. దీనివల్ల చాలా మందిపై పన్ను పోటు తగ్గి, పెట్టుబడులకు అవసరమైన నిధులు మిగులుతాయని భావిస్తున్నారు.