చీరాల పట్టణం జయంతిపేటలో షుగర్ టాబ్లెట్లు పేరుతో మత్తు మాత్రలు ఇచ్చి ఓ మహిళ ఇంట్లో బంగారు నగలు, నగదు అపహరించుకుపోయిన దొంగను గురువారం చీరాల టూ టౌన్ సిఐ సోమశేఖర్ అరెస్టు చేశారు. అపహరణకు గురైన 52 గ్రాముల నగలను నిందితుడి నుండి పూర్తి గా రికవరీ చేయడం విశేషం ఈ కేసు పూర్వపరాలను సీఐ సోమశేఖర్ మీడియాకు వివరించారు.
నెల్లూరు జిల్లా కోట మండలానికి చెందిన చేవూరి చంద్ర అనే వ్యక్తి ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీ మధ్యాహ్నం జయంతిపేటలోని మేడికొండ ప్రసన్నకుమారి ఇంటికి వెళ్లి షుగర్ టాబ్లెట్స్ ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పి ఆమె చేత మత్తు మాత్రలు మింగించాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే నగలు ను అపహరించు పోయాడు. తదుపరి పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించి ఎట్టకేలకు ముద్దాయిని బాపట్ల బస్టాండులో పట్టుకున్నామని, చోరీ సొత్తు మొత్తాన్ని రికవరీ చేశామని చెప్పారు. రికవరీ చేసిన చోరీ సొత్తు విలువ రెండు లక్షల వరకు ఉంటుందన్నారు.
కాగా చంద్ర అంతర్ జిల్లా దొంగని, అనేక చోట్ల కేసులు ఉన్నాయని కూడా సి. ఐ సోమశేఖర్ వివరించారు. చాకచక్యంగా అంతర్ జిల్లా దొంగను పట్టుకున్న సిఐ సోమశేఖర్, ఆయన బృందాన్ని డిఎస్పీ శ్రీకాంత్ అభినందించారు. మీడియా సమావేశంలో ఎస్ఐలు చంద్రావతి, సురేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.