మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టీటీడీ అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి దర్శనం టికెట్ల కౌంటర్‌ను ప్రారంభించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు గురువారం నుంచి తిరుపతి విమానాశ్రయంలోనే మంజూరు చేస్తున్నారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్‌ను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు.
శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇచ్చి టికెట్ కోసం రూ. 500 చెల్లించే భక్తులకు తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేసేవారని చెప్పారు జేఈవో. దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్ లో శ్రీ వాణి ట్రస్ట్ టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎయిర్‌పోర్టు, తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్‌లో శ్రీ వాణి టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల.. దాతలు ముందు రోజు తిరుమలకు వెళ్ళి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ ప్రక్రియలో దాతలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గుర్తించి టీటీడీ యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి మాధవంలో వారికి వసతి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనివల్ల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తిరుపతి విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కౌంటర్ల నిర్వహణకు ముందుకొచ్చిన హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు యాజమాన్యానికి జేఈవో కృతజ్ఞతలు తెలిపారు.
ఇటు శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్ల కౌంటర్ తిరుపతిలో ఏర్పాటు చేశారు. మాధవం అతిథిగృహంలో ఇటీవల కౌంటర్లను ప్రారంభించారు. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇచ్చి రూ.500 చెల్లించే భక్తులకు తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు ఇచ్చేవారు. భక్తులు ముందు రోజు తిరుమలకు వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్లు తీసుకునేవారు. దాతలకు ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించిన టీటీడీ.. శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడే వారికి వసతి గదులు కేటాయిస్తారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో పురాతన ఆలయాల అభివృద్ధి, జీర్ణోద్ధరణ, కొత్తగా ఆలయాలు, భజన మందిరాలను టీటీడీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ సూచించింది.