బెజవాడ వాసులు ఆందోళన చెందుతున్నారు. కారణం కృష్ణా జలాల రంగు మారడమే. ప్రకాశం బ్యారేజ్ దగ్గర పచ్చటి రంగులోకి నీళ్లు మారిపోయాయి. అలాగే రసాయనాలతో కూడిన ఒక పొర నీటిపై ఏర్పడింది.. అదే నీరు ఏలూరు కాలువలో కూడా కలుస్తోంది. కృష్ణ జలాలు కలుషితం అయ్యాయని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ నీళ్లను ఉపయోగిస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూరర్ ఏరియా జనాలు బ్యారేజ్ దగ్గర పచ్చటి రంగులో ఉన్న నీటిని చూసి భయపడుతున్నారు. రసాయనాల వల్లే నీళ్ల రంగు ఇలా మారిందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రసాయనాలతో కలుషితం అవుతున్న కృష్ణ నీటిని ఎలా ఉపయోగించుకోవాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
నీళ్లు నిల్వ ఉండటం వల్ల రంగు మారిందా.. ఏదైనా రసాయనాలు కలవడం వల్ల మారిందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే గతంలో కూడా నీళ్లు ఇలా రంగు మారాయని తెలుస్తోంది. ప్రతి ఆరు నెలలకోసారి నదిలోని నీరు రంగు మారుతుందని.. కానీ ఇలా మారడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. కృష్ణానదిలో నీళ్లు ఆకుపచ్చగా మారడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. ఏదైనా ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు నీటిలో కలిశాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.