చైనా సైనికులకు భారత ఆర్మీ వణుకుపుట్టిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్లో గీత దాటిన చైనా సైనికులకు భారత జవాన్లు గట్టిగా బుద్ధి చెప్పిన సంగతి తెలిసిందే. చైనాతో సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో, భారత వాయుసేన భారీ వైమానిక విన్యాసాలకు తెరలేపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రెండ్రోజుల పాటు జరగనున్న ఈ గగనతల విన్యాసాల్లో భారత వాయుసేన తన ప్రధాన యుద్ధ విమానాలు, ఇతర ఆయుధ వ్యవస్థలన్నింటినీ ప్రదర్శించింది. ఈ విన్యాసాల్లో శత్రుభీకర రాఫెల్ యుద్ధ విమానాలు కూడా పాల్గొన్నట్టు వాయుసేన వెల్లడించింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధవిమానాలను గతేడాది జులైలో వాయుసేనకు అప్పగించారు. ఇదిలావుంటూ ఈ వైమానిక విన్యాసాలు ముందే నిర్ణయించుకున్నవని, చైనాతో సరిహద్దుల వద్ద ఇటీవలి పరిణామాలకు, వీటికి సంబంధం లేదని భారత వాయుసేనకు చెందిన ఓ అధికారి వెల్లడించారు.