క్యాన్సర్ చికిత్సకు వైద్య సేవల కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ కేర్ గ్లోబల్ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ఒప్పందంలో భాగంగా, జిల్లా ఆసుపత్రుల వైద్యులు, సిబ్బందికి హెల్త్ కేర్ గ్లోబల్ (హెచ్ సీజీ) సంస్థ క్యాన్సర్ చికిత్స శిక్షణ ఇవ్వనుంది. న్యూట్రిషన్, యోగా, ఇతర అంశాలపైనా శిక్షణ అందించనుంది.
ప్రతి నెలా జిల్లా ఆసుపత్రుల్లో క్యాన్సర్ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనుంది. అంతేకాదు, 50 పడకల క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు కూడా హెల్త్ కేర్ గ్లోబల్ సంస్థ సలహాలు, సూచనలు అందించనుంది. ఈ ఒప్పందంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని స్పందించారు. హెచ్ సీజీతో ఒప్పందం వల్ల ఎంతో మేలు కలుగుతుందని, క్యాన్సర్ చికిత్సలో మరో మైలురాయి అని అభివర్ణించారు. సీఎం జగన్ చిత్తశుద్ధి వల్ల క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యం అందుతోందని తెలిపారు. ఏపీలోని క్యాన్సర్ వైద్య విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.