ప్రొద్దుటూరు: కడపలో నేడు జరగబోయే బిసి భవన శంకుస్థాపనకు జిల్లా వ్యాప్తంగా బిసిలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్సీ కార్యాలయంలో వైయస్సార్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా, ఐదవ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, 22వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ గౌస్, 19వ వార్డు కౌన్సిలర్ మునీర్, బి. సి. సంఘ నాయకులు, కార్యకర్తలు, మరియు అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా బి. సి. ల చిరకాల స్వప్నమైన బి. సి. భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం శనివారం కడప నగరంలోని పాత రిమ్స్ నందు నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన 0. 20 సెంట్ల స్థలము నందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిధులనుంచి ఐదు కోట్ల రూపాయలతో బి. సి. లు సభలు, సమావేశాలు నిర్వహించడానికి పెద్ద కమ్యూనిటీ హాలు, పేద బి. సి. నిరుద్యోగులకు స్టడీ సర్కిల్, లైబ్రరి, అతిధుల కోసం, విద్యార్థుల కోసం రూములు నిర్మించడం జరుగుతుందని వివరించారు. ఈ బి. సి. భవన నిర్మాణానికి స్థలం కేటాయించిన జగనన్న ప్రభుత్వానికి, భవన నిర్మాణానికి నిధులు కేటాయించేందుకు అవిరళ కృషి చేసిన కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి యస్. బి. అంజద్ బాషాకి, కడప నగర మేయర్ కె. సురేష్ బాబుకి, కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిజేయడానికి బి. సి. సంక్షేమ సంఘం తరపున బహిరంగ సభ నిర్వహించబడుతోందని తెలిపారు. కావున జిల్లాలోని బి. సి. సంఘ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ మహత్తరమైన శంకుస్థాపన కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు.