నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సమస్యలపై ఈ నెల 21న ధర్నా నిర్వహిస్తున్నామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక విలేఖరులకు వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిని, రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. తుగ్లక్ ముఖ్యమంత్రి రైతులను కనీసం పలకరించిన పాపాన పోలేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో తుఫాన్ వచ్చినప్పుడు పది రోజులు అక్కడే ఉండి ప్రజలను ఆదుకున్నారని గుర్తు చేశారు. గత ఏడాది ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.1800 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నిలదీయవలసిన అవసరం ఉందన్నారు. రైతులకు తుఫాన్ నష్టపరిహారం ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న స్థానిక సీబీఎం కాంపౌండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ర్యాలీకి అనుమతి కోసం పట్టణ సీఐ, డీఎస్పీకి వినతి పత్రం ఇచ్చామని, పోలీసులు సహకరించి రైతులకు సంఘీభావం తెలపాలని కోరారు.