రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాంను అయన క్యాంపు కార్యాలయంలో ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు, జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం ఆధ్వర్యంలో జిల్లా, టౌన్ ఎన్జీఓ సంఘ నేతలు మంగళవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల సంఘానికి జరిగిన ఎన్నికలు ఎకగ్రీవమైన విషయాన్ని ఆయనకు వివరించి జిల్లా, కార్యవర్గ సభ్యులను పరిచయం చేసారు. ఐదవసారి సాయిరాం జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల స్పీకర్ సీతారాం హర్షం వ్యక్తం చేసి సాయిరాంను, నూతన కార్యవర్గాలను అభినందించారు. ఉద్యోగులంతా ఏకతాటిపై నిలిచి ఎన్నికల ద్వారా తమ ఐక్యతను చాటిచెప్పారని కొనియాడారు. ఉద్యోగుల పనితీరుతోనే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరించాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకరిస్తానని, ఏపీ ఎన్జీఓ సంఘానికి అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందిస్తానని సీతారాం చెప్పారు. స్పీకర్ను కలసిన వారిలో జిల్లా, టౌన్ సంఘ నేతలు చల్లా శ్రీనివాసరావు, రాయి వేణుగోపాలరావు, బడగల పూర్ణచంద్రరావు, ఆర్. గోవింద పట్నాయక్, బొత్స శ్రీనివాసరావు, నవీన్, శ్రీరామ్ కుమార్, భూపాలరావు, రత్నకుమార్, కె. రోజాకుమారి, జి. లలిత, నారాయణమ్మ, మమతాకుమారి తదితరులు వున్నారు.