తాజాగా ఓ లీగ్ ను దక్షిణాఫ్రికా బోర్డు ప్రకటించింది. దాని విలువ కూడా అమాంతంగా ప్రకటిించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాత ప్రపంచవ్యాప్తంగా బోల్డన్ని లీగ్ లు పుట్టుకొచ్చాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక సహా చాలా దేశాల బోర్డులు లీగ్ లు ప్రకటించి విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. లీగ్ లు ఎక్కడ జరిగినా విశేష అదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణాఫ్రికా బోర్డు కూడా లీగ్ ప్రకటించింది. ఎస్ఏ టీ20 పేరుతో నిర్వహించనున్న ఈ లీగ్ ప్రైజ్ మనీని తాజాగా వెల్లడించింది. టోర్నీలో మొత్తం 7 కోట్ల ర్యాండులు.. మన కరెన్సీలో దాదాపు రూ. 33.35 కోట్లను ప్రైజ్ మనీగా ఇవ్వనున్నట్టు లీగ్ కమిషనర్, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తెలిపారు. దక్షిణాఫ్రికా ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద మొత్తం కావడం గమనార్హం.
జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 11 వరకు మొత్తం నెల రోజులపాటు మ్యాచ్‌లు జరుగుతాయి. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో మొత్తం 33 మ్యాచ్‌లు ఉంటాయి. ఈ ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే కొనుగోలు చేయడం విశేషం. వాటి పేర్లు.. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, పార్ల్ రాయల్స్, జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్, ప్రిటోరియా కేపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేర్లతో తలపడనున్నాయి.