ట్విట్టర్ లో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన ఎలాన్ మస్క్ తాజాగా తానే ఆ సంస్థ బాధ్యతల నుంచి వైదొలిగే పరిస్థితి వచ్చేసింది. ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుంచి వీలైనంత త్వరగా తప్పుకోనున్నట్లు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. సీఈవో బాధ్యతలు చేపట్టాలని ఫూలిష్ గా భావించే వ్యక్తి దొరకగానే ఈ పోస్టుకు రాజీనామా చేస్తానని చెప్పారు. తర్వాత ట్విట్టర్ కు సంబంధించిన సాఫ్ట్ వేర్, సర్వర్ టీమ్ బాధ్యతలు చూసుకుంటానని మస్క్ వివరించారు. అంతకుముందు ట్విట్టర్ లో తనపైనే మస్క్ పోల్ నిర్వహించుకున్నారు. సంస్థ సీఈవోగా తాను ఉండాలా.. వైదొలగాలా? అంటూ యూజర్లను అడిగారు. ఎక్కువ మంది ఏది చెబితే అదే చేస్తానని ఆదివారం ప్రకటించారు.
మొత్తం 24 గంటల పాటు కొనసాగిన ఈ పోల్ లో 57.5 శాతం మంది యూజర్లు మస్క్ ను సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఓటేశారు. మిగతా 42.5 శాతం మంది మాత్రం ట్విట్టర్ సీఈవోగా మస్క్ ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పోల్ లో ఎక్కువమంది యూజర్లు తనను తప్పుకోవాలని సూచించడంపై మంగళవారం మస్క్ స్పందించారు. పోల్ లో గడబిడ జరిగిందని ఆరోపించారు. అయినప్పటికీ తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని, త్వరలోనే సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటానని స్పష్టంచేశారు.
ట్విట్టర్ సీఈవోగా మస్క్ తప్పుకోవాలనే దానిపై కొన్ని వారాలుగా చర్చ జరుగుతోందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంపై ఎక్కువ శ్రద్ధ పెడుతూ టెస్లా కంపెనీ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్నారని మస్క్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. టెస్లాలో ప్రొడక్ట్ డిజైన్, ఇంజినీరింగ్ బాధ్యతలను మస్క్ పర్యవేక్షిస్తున్నారు. ట్విట్టర్ కొనుగోలు తర్వాత టెస్లా కంపెనీ వ్యవహారాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టట్లేదని ఆ కంపెనీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.