నరసరావుపేటలో టీడీపీ ముస్లీం నేత షేక్ ఇబ్రహీం హత్యపై టీడీపీ నాయకులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఓ ట్వీట్ చేస్తూ... ‘‘ఇది అత్యంత కిరాతక చర్య. పల్నాడులో శాంతిభద్రతల దుస్థితికి ఈ హత్యోదంతమే నిదర్శనం. పల్నాడును ఏం చేయాలనుకుంటున్నారో... ఈ హత్యాకాండ ఎందుకో సీఎం సమాధానం చెప్పాలి. పల్నాడు జిల్లా అసమర్థ ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి’’ అని డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన చేస్తూ... ‘‘వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలను ఊచకోత కోస్తున్నారు. జగన్‌రెడ్డి పుట్టిన రోజు బహుమతిగా మైనారిటీ సోదరుడి శవాన్ని ఎమ్మెల్యే గోపిరెడ్డి అందించారు. వైసీపీ నేతలు క్రూర జంతువుల్లా టీడీపీ కార్యకర్తలను పొట్ట్టన పెట్టుకుంటున్నారు. మైనార్టీ కార్యకర్త హత్యకు కారకుడైన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముగ్గురు ఉగ్రవాదులు పల్నాడును వల్లకాడు చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పల్నాడు ప్రజలు తన్ని తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇబ్రహీం కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది’’ అని అన్నారు.