సంక్రాంతి సీజన్ ప్రారంభమవటంతో గ్రామాల్లో పందెం పుంజులు అపహరణకు గురవుతున్నాయి. పగటి పూట గ్రామాల్లో రెక్కీ నిర్వహిస్తున్న ఆగంతకులు కోడిపుంజులు ఎక్కడెక్క డున్నాయో పసిగట్టి అర్ధరాత్రి వాటిని తస్కరిస్తున్నారు. దీంతో పందెం కోళ్ల పెంపకందారులు లబోదిబోమంటున్నారు. పందెం పుంజు రూ. 15 వేలు నుంచి 25 వేలు వరకు ధర పలుకుతోంది. వీటికి బాదం పప్పుతోపాటు కైమాను కూడా పెట్టి పెంచుతారు. సంక్రాంతికి బరుల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభం కావటంతో కోడి పుంజులకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా దుండగులు రాత్రి పూట బైకులపై వచ్చి ఊరు బయట ఉంచిన కారులో తరలించుకుపోతున్నట్టు సమాచారం. కాగా పెదలంకలో ఈ నెల 19వ తేదీ రాత్రి దుండగులు ఫారం నుంచి పది పందెం కోడిపుంజులను అపహరించారని, వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని పెంపకందారులు తెలిపారు. కోడిపుంజులు అరవ కుండా వాటిపైనా, కాపలదారులపై కూడా దుండగులు మత్తు మందు చల్లుతారని చెబుతున్నారు. రామకృష్ణపురం, మూల్లంక, కొండంగి, భాస్కరావుపేట గ్రామాల్లో కొన్ని నెలల క్రితం పందెం కోడి పుంజులను అపహరించిన ఘటనలు జరిగాయి.