కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి గానీ అంతగా ఆందోళన చెందాల్సిన పరిస్థితిలు మాత్రం మన భారతదేశంలో లేవని నిపుణులు అంటున్నారు. చైనాలో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు భారీగా పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. మాస్క్ లు విధిగా ధరించడం, శానిటైజర్లను ఉపయోగించడం, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సంచరించకపోవడం, భౌతిక దూరం ఇలాంటి చర్యలను పాటించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. కాకపోతే ఇవి ముందు జాగ్రత్త కోసం చేసినవే. చైనాలో కేసుల తీవ్రతను చూసి మనం భయపడిపోవక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ఆధారంగా ఉన్న కీలక గణాంకాలను వారు ప్రస్తావిస్తున్నారు. ఈ నెల 21 నాటికి రోజువారీ సగటు కేసుల సంఖ్య 139గానే ఉంది. 2020 మార్చి 31 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి.
కరోనా మూడో విడతలో 2021 డిసెంబర్ 16 నుంచి కేసులు వెలుగు చూశాయి. కానీ, 10 రోజుల తర్వాత డిసెంబర్ 26 నుంచి పెరుగుదల కనిపించింది. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి మన దగ్గర లేదు. నెల క్రితంతో చూస్తే ప్రస్తుతం వారం వారీ సగటు కొత్త కేసులు 30 శాతం తక్కువగా ఉన్నాయి. గరిష్టంగా 100 కేసులకు మించి నమోదు కావడం లేదు. కేరళలో 67, మహారాష్ట్రలో 22, కర్ణాటకలో 19 కేసులే వస్తున్నాయి.
మన దగ్గర మరణాల రేటు మొదటి రెండు విడతల కంటే మూడో వేవ్ లో తక్కువగా ఉంది. మొదట ఆల్ఫా వేరియంట్ లో 1.25 శాతం, రెండో విడత డెల్టా వేవ్ లో 1.07 శాతం, మూడో విడత కరోనా ఒమిక్రాన్ వేవ్ లో మరణాల రేటు 0.36 శాతం చొప్పున నమోదైంది. ప్రస్తుతం మరణాలు నమోదు కావడం లేదు.
మన దగ్గర గతంతో పోలిస్తే కరోనా నిర్ధారణ పరీక్షలు పెద్దగా నిర్వహించడం లేదు. పరీక్షల కోసం ఎవరూ ముందుకు రావడం లేదు. లక్షణాలు చాలా స్వల్పంగా ఉండడంతో ప్రజలు సాధారణ ఔషధాలను తీసుకుంటున్నారు. పరీక్షల కోసం, వైద్యుల వద్దకు రావడం లేదు. కనుక ఇవన్నీ లెక్కల్లోకి రావడం లేదన్న అభిప్రాయం ఉంది. మన దగ్గర ఇప్పటికే మూడు విడతలు కరోనా వ్యాప్తి చెందడం, దాదాపు అందరూ ఇన్ఫెక్షన్ల బారిన పడడం, ఎక్కువ మంది రెండు డోసుల టీకాలు తీసుకోవడంతో రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. కనుక మనకు మరో విడత కరోనా రిస్క్, మరణాల రేటు అంతగా ఉండకపోవచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది. రెండు డోసుల టీకా తీసుకున్న వారు బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనికితోడు కరోనా నివారణ చర్యలను అనుసరించడం ద్వారా నిశ్చితంగా ఉండొచ్చని సూచిస్తున్నారు.
చైనాలో ఇంత వరకు ఏ వేవ్ లోనూ పెద్దగా కేసులు రాలేదు. అక్కడి సర్కారు జీరో కోవిడ్ విధానం పేరుతో ఒక్క కేసు నమోదైనా, సదరు ప్రాంతంలో పూర్తిగా లౌక్ డౌన్ అమలు చేసింది. దీంతో అక్కడి జనాభాలో ఎక్కువ మంది ఇన్ఫెక్షన్ బారిన పడలేదు. చైనాలో స్థానికంగా తయారైన టీకాలను ప్రజలకు ఇచ్చారు. ఆ టీకాలు సమర్థవంతమైనవి కావని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలే ఇప్పుడు అక్కడ పరిస్థితి తీవ్రతకు కారణాలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa