నెల్లూరు జిల్లా, చేజర్ల, మండలంలోని తూర్పుకంభంపాడు గ్రామ సమీపంలో తెల్లరాయి అక్రమంగా తవ్వుతున్నారంటూ శుక్రవారం రెవెన్యూ అధికారులకు గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో వీఆర్‌వోతో పాటు గ్రామ వీఆర్‌ఏలు సంఘటనాస్థలికి చేరుకుని అడ్డుకున్నారు. అక్కడ ఉన్న హిటాచ్‌తో పాటు, రెండు ట్రిప్పర్లను స్వాధీనం చేసుకుని కాపలాదారులను పెట్టారు. వాహనదారులను ప్రశ్నించగా తమకేమి తెలయదని, అయినా రైతుల భూములలో తవ్వుకుంటే మీ కెందుకనేలా ఎదురు ప్రశ్నించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే వారం రోజుల నుంచి రేయింబవళ్లు తేడా లేకుండా ప్రైవేటు, ప్రభుత్వ భూములతో పాటు, అటవీ భూములలో కూడా తెల్లరాయి కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు గ్రామస్థులు అరోపిస్తున్నారు. ఈ సంఘటనపై ఇంచార్జ్ తహసీల్ధారు పి. విజయ్ మాట్లాడుతూ వీఆర్‌వో నివేధిక అధారంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అదే విధంగా సీఐ రవినాయక్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ నుంచి తమకెలాంటి ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామన్నారు.