ప్రభుత్వం 2022 అక్టోబర్ ఒకటో తేదీన ప్రారంభించిన వైయస్సార్ కళ్యాణమస్తు/ షాదీ తోపా పథకంపై గ్రామస్థాయిలో అందరికీ అవగాహన కల్పించాలని వైయస్సార్ క్రాంతి పదం అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పైడి కూర్మారావు తెలిపారు. సోమవారం ప్రభుత్వం బాలికల విద్యను ప్రోత్సహించడానికి మరియు 18 ఏళ్లు దాటిన వరకు పెళ్లి చేయకుండా ఉండేందుకు వెనుకబడిన వర్గాల ఆడపిల్లల వివాహ ఖర్చుల నిమిత్తం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకంపై అవగాహన రాహిత్యం వల్ల అర్హులు సకాలంలో నమోదు చేసుకోవడం లేదు. కాబట్టి గ్రామస్థాయిలో అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించమని సిబ్బందికి సూచించారు. 2022 అక్టోబర్ ఒకటో తేదీ తరువాత వివాహమైన వారు 60 రోజుల్లోపు పెండ్లి కుమార్తె హౌస్ మ్యాపింగ్ అయిన సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పుట్టిన తేదీ , కులము , ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందించాలి. సంబంధిత సచివాలయంలో వధువు, వరుడు బయోమెట్రిక్ వేసుకోవాలి. వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. వికలాంగులైతే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. అర్హులైన బీసీలకు 50, 000 ,షెడ్యూల్ కులాలు తెగల వారికి/ మైనార్టీలకు లక్ష రూపాయలు, కులాంతర వివాహానికి 1, 20, 000, వికలాంగులకు 1,50,000 , ఆర్థిక సహాయము నేరుగా పెండ్లి కుమార్తె బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య ప్రతినిధులు అకౌంటెంట్ కళ్యాణి , డేటా ఎంట్రీ ఆపరేటర్ జగదీష్, క్లస్టర్ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.