వైయస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంలో సమగ్ర సర్వే కార్యక్రమం సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. వైయస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా అధికారులుకు సీఎం వైయస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రీ – సర్వే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని స్పష్టం చేశారు. వందేళ్ల తర్వాత మరలా సర్వే చేస్తున్నాం అంటే నిజంగానే కొత్త చరిత్ర లిఖిస్తున్నట్లే. రీ సర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నాం.. వాటి ఫలాలు కచ్చితంగా ప్రజలకు అందాలని ఉద్ఘాటించారు. సర్వేలో కచ్చితంగా నాణ్యత ఉండాలని, దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతమంది సర్వేయర్లు, సర్వే సిబ్బంది మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారని గుర్తు చేశారు.