బంగాల్ కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. మహిళ కడుపులో నుంచి 46 కిలోల కణితిని తొలగించారు. స్మితా దాస్(61) అనే మహిళ గత 15 ఏళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఏడు నెలల క్రితం ఆరోగ్యం బాగా క్షీణించి నడవలేని స్థితికి రావటంతో కుటుంబీకులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రికి వచ్చేసరికి రోగి పరిస్థితి విషమంగా ఉంది. మహిళ కడుపులో 46 కిలోల కణితిని గుర్తించిన వైద్యులు 2గంటలపాటు శ్రమించి దానిని తొలగించారు. రోగి బరువు 50 కిలోలే అయినప్పటికి కణితి వల్ల దాదాపు 100 కిలోల బరువు ఉండేదని వైద్యులు తెలిపారు.