‘‘రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేనలతో కలిసే నేను పోటీ చేస్తా. అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. వైసీపీకి చెందిన అరడజను మంది నాయకులు, నాయకురాళ్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు నన్ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగనే వెనక ఉండి ఈ విమర్శలు చేయిస్తున్నారు. జగన్ నేరుగా నాపై విమర్శలు చేయవచ్చు. ఆయనకూ ఒక ట్విటర్ అకౌంట్ ఉంది. ట్విటర్ వేదికగా సీఎం నన్ను విమర్శిేస్త ఎక్కువ మంది చూస్తారు’’ అని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నన్ను ఎంతలా రెచ్చగొట్టాలని చూసిన నేను రెచ్చిపోయేది లేదు. మాజీ హోంమంత్రి సుచరిత, ఎంపీ మాధవి, హోం మంత్రి తానేటి, బాపట్ల ఎంపీ నాపై తాడేపల్లి కార్ఖానాలో తయారయిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేశారు. నేను ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గం ప్రజలను, నాయకులను అత్యంత గౌరవిస్తా. మా ముఖ్యమంత్రి మాదిరిగా మాటలతో కాకుండా.. చేతలతో గౌరవిస్తా’’ అని తెలిపారు. సీఎం జగన్ తన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి మళ్లీ పదవులు కట్టబెట్టారని రఘురామ ఆరోపించారు. కడప జిల్లా ఎలక్ర్టిసిటీ ఇన్‌స్పెక్టరేట్‌లో విధులు నిర్వహించిన పద్మా జనార్దన్‌రెడ్డికి ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ పదవి, మరో కీలక పదవిని శివ ప్రసాద్‌రెడ్డికి కట్టబెట్టారని తెలిపారు.