రాష్ట్రంలో అన్ని కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు జనవరి 26 నాటికి ప్రారంభించాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అదే తేదీకల్లా వైద్యుల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై ఆయన సమీక్షించారు. వైద్య ఆరోగ్యశాఖలో డాక్టర్లు, సిబ్బంది భర్తీ, మందుల పంపిణీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, బోధనాసుపత్రుల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జనవరి 26 నాటికి విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు కూడా పూర్తి కావాలన్నారు. విలేజ్ క్లినిక్స్ మొదలుకుని సీహెచ్‌సీలతో సహా బోధనాసుపత్రుల వరకూ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉండాలని.. దీనికోసం ఎస్‌ఓపి రూపొందించాలని, మందుల కొరత అన్న మాటే ఉండరాదని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సె్‌ప్టకు అవసరమైన 104 వాహనాలను జనవరి 26 నాటికి సిద్ధం చేసుకోవాలన్నారు. 104 సేవలను కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని తెలిపారు. ఆరోగ్యశ్రీ రిఫరల్‌కు సంబంధించిన యాప్.. ఏఎన్‌ఎం, ఆరోగ్యమిత్ర సహా అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపులో ఫాలో అఫ్ మెడిసన్ అందుతోందో లేదో పరిగణనలోకి తీసుకోవాలని.. గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్ సిబ్బంది నుంచీ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని తెలిపారు.