మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి నవులూరు, నిడమర్రు, పెనుమాక లో నిర్మితమైన టిడ్కో గృహ సముదాయాలకు మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్ పనులు వీలైనంత త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే ఆర్కే టిడ్కో, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పెనుమాక, నిడమర్రు టిడ్కో గృహ సముదాయాలను సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. పెనుమాక టిడ్కో సముదాయానికి వెంబడినే కొండవీటి వాగు ఉందని, వర్షాకాలంలో వాగు పొంగినా, కోతకు గురైనా ప్రమాదం పొంచి ఉన్న నేపధ్యంలో కొండవీటి వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ను ఫోన్ లో కోరారు.
ఇక నివాసితుల తాగునీటి సౌకర్యార్థం సమీపంలోని కొండవీటి వాగు నుంచి ప్రత్యేక పైపులైను నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. యర్రబాలెం విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి పెనుమాక టిడ్కో గృహ సముదాయానికి విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పెనుమాక టిడ్కో సముదాయంలో 23 అడుగుల ప్రధాన సీసీ రహదారి పాటు 23 అడుగుల అంతర్గత సీసీ రహదారులు మొత్తం 400మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణాలతో పాటు 450మీటర్ల గ్రావెల్ రహదారి నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే ఆర్కే నవులూరు టిడ్కో గృహ సముదాయాన్ని సందర్శించి జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పెనుమాక, నవులూరు, నిడమర్రు లో 1824 టిడ్కో గృహాలకు గానూ ఇప్పటి వరకూ 1400గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని, సాంకేతిక కారణాల వల్ల రిజిస్ట్రేషన్ కాని మిగిలిన 400 నివాసాల రిజిస్ట్రేషన్ లు కూడా త్వరితగతిన రిజిస్ట్రేషన్ పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సంక్రాంతి నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో టిడ్కో డీఈ ప్రసాద్, ఏఈ కృష్ణ, నగరపాలక సంస్థ డీఈ కృష్ణారెడ్డి, ఏఈ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.