నెల్లూరు సభలో జరిగిన తొక్కిసలాటలో పార్టీ కార్యకర్తలు మరణించడం బాధాకరమని టిడిపి నేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లా కందుకూరు విచ్చేశారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. కందుకూరులో రోడ్లు క్రిక్కిరిసి పోయాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సభ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది.
విపరీతమైన రద్దీ నెలకొనడంతో కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. పలువురు కార్యకర్తలు రోడ్డు పక్కనే ఉన్న గుండం కట్ల అవుట్ లెట్ కాలువలో పడిపోయారు. వారిలో కొందరు స్పృహ కోల్పోయారు. ఈ విషయం తెలియడంతో చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన కార్యకర్తలను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.
ఇది బాధాకరమైన ఘటన అని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని, వారు క్షేమంగా ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని తెలిపారు. ఈ ఘటన కారణంగా కందుకూరులో చంద్రబాబు ప్రసంగం ఆలస్యమైంది. బాధితుల పరిస్థితి తెలుసుకున్నాకే ప్రసంగిస్తానంటూ చంద్రబాబు తెలిపారు. కార్యకర్తల కోసం సభను తాత్కాలికంగా నిలిపివేసిన చంద్రబాబు ఆసుపత్రికి తరలి వెళ్లారు. కార్యకర్తల పరిస్థితిని సమీక్షించి సభపై నిర్ణయం తీసుకుందామని నేతలకు తెలిపారు.